రాక్షస పాలన అంతం కావాలి..!

‘ఇసుక, మట్టి, బొగ్గు, కరెంట్‌ కొనుగోళ్లు, రాజధాని భూములు, విశాఖ భూముల్లో అవినీతి అక్రమాలు, కరువు, తుపాను, ఇసుక దోపిడీ, నిరుద్యోగం.. గత నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ఇచ్చింది ఇదే.. ఈ రాక్షస పాలన తప్ప ఇంకేమీ ఇవ్వలేదు’  అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 330వ రోజు సోమవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా మెళియపుట్టిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

రాష్ట్రంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారి పోతున్నాయో.. కాంగ్రెస్‌–టీడీపీ మధ్య అనైతిక పొత్తు ఎలా సాగుతోందో రాష్ట్ర ప్రజలంతా గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సినిమా చూపించిన చంద్రబాబు.. ఇప్పుడు రాహుల్‌తో కలిసి ‘కాంగ్రెస్‌తో సంసారం’ అనే మరో కొత్త సినిమాను ప్రజల ముందుకు తెస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

 శ్రీకాకుళం జిల్లాలో పదికి ఏడు ఎమ్మెల్యేలు ఇస్తే చాలదన్నట్లు చంద్రబాబు మరొకరిని వైఎస్సార్‌సీపీ నుంచి కొనుగోలు చేశారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో జిల్లాకు ఏం చేయలేదు. మతల పెనుగట్టవాడ నుంచి ఇసుకను భారీగా దోపిడీ చేశారు. వంశధార నిర్వాసితులకు దక్కాల్సిన పరిహారాన్ని బోగస్‌ పేర్లతో కొట్టేశారు. 9 ఏళ్లలో వంశధార ప్రాజెక్ట్‌ కట్టాలని ఏ రోజు చంద్రబాబు ఆలోచన చేయలేదు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో కాల్వ పనులను ప్రారంభించారు.

రూ.700 కోట్లు ఖర్చు పెట్టి వంశధార ప్రాజెక్ట్‌ను ఉరుకులు పెట్టించారు. కేవలం రూ. 55 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్ట్‌ పూర్తయ్యేది. కానీ చంద్రబాబు రూ.476 కోట్లకు అంచనాలు పెంచి కాంట్రాక్టర్‌గా సీఎం రమేష్‌ను తెచ్చుకున్నారు. 22 గ్రామల నిర్వాసితుల సమస్యలు తీరలేదు. 200 మంది రైతులపై కేసులు పెట్టారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నేరేడు బ్యారేజ్‌ నిర్మాణంతో పాటు పెండింగ్‌ ప్రాజెక్ట్‌ పనులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. హిరమండల నిర్వాసితుల కోసం ధర్నా చేసి మద్దతుగా నిలిచాను. వంశాధార ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు అండగా ఉంటాను. పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తాం, పరిహారం పూర్తిగా చెల్లిస్తామని తెలిపారు.

leave a reply