అదుగో.. రాకాసీ..

వరుస సునామీలు ఇండోనేషియాను అతలాకుతలం చేస్తుంది. సెప్టెంబర్‌లో ఒకసారి పలకరించి వెళ్లిన రాకాసి సునామీ ఇప్పుడు విజృంభిస్తుంది.

ఇండోనేషియా సునామీ విధ్వంసంలో మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది. సముద్రంలో ఉన్న అనక్ క్రకటోవా అగ్నిపర్వతం బద్దలవడంతో ఏర్పడిన అలజడులు సునామీగా మారి సుందా స్ట్రెయిట్ తీరాన్ని గత శనివారం ముంచెత్తిన విషయంతెలిసిందే. ఈ జలవిలయం కారణంగా ఇప్పటివరకు 429మంది మృతిచెందారని ఇండోనేషియా ప్రభుత్వం ప్రకటించింది. మరో 1400మందికి పైగా గాయపడ్డారని, వందలాదిమంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. వందలాది భవనాలు ధ్వంసం కాగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు విపత్తు నిర్వహణ బృందాలతోపాటు సైన్యం కూడా సహాయచర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నది.

భారీ యంత్రాలు, పొక్లెయినర్లతోపాటు జాగిలాలు, డ్రోన్లను, ప్రత్యేక కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ జావా తీరం వెంబడి 100కిలోమీటర్ల పరిధిలో ఉన్న పలు ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, వాటిని మరింత విస్తరిస్తామని ఇండోనేషియా ప్రభుత్వం తెలిపింది. దేశాధ్యక్షుడు జోకో విడోడో సోమవారం బాధిత ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షం, తగినంత వెలుతురు లేని కారణంగా సహాయచర్యలకు తరుచూ ఆటంకం ఏర్పడుతున్నదని రెడ్‌క్రాస్ సంస్థ తెలిపింది. సునామీతో సర్వం కోల్పోయిన ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారం, పాలు లేక పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారని, మందులూ అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. మేం సర్వస్వం కోల్పోయాం. ఒక్క రోజుతో విగతజీవులుగా మారాం. రోగాలతో బాధపడుతున్నా పట్టించుకునేవారు లేరు అని స్యాంసియార్ అనే వ్యక్తి చెప్పారు.

మరోసారి సునామీ వచ్చే ప్రమాదముందని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించగా, స్థానికంగా వ్యాపిస్తున్న వదంతులు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సముద్రం ఉప్పొంగుతున్నది.. పరిగెత్తండి.. అంటూ వ్యాపిస్తున్న వదంతులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సుంబర్ జయ ప్రాంతంలో చాలామంది గత మూడురోజులుగా పర్వతాలు, ఎత్తయిన భవనాల దిశగా ప్రాణభయంతో పరుగులు తీయడం, అవన్నీ ఉత్తవేనని తెలియడంతో ఊపిరి పీల్చుకోవడం పరిపాటిగా మారింది. ఇక పాండెగ్లాంగ్ తీరం నుంచి 47 కి.మీ. దూరంలో ఉన్న అనక్ క్రకటోవా అగ్నిపర్వతం మంగళవారం కూడా పొగలు గక్కుతూనే ఉంది.

leave a reply