ఇంట్లో వాళ్లు చంపితేనే ఆధారాలు మాయం చేస్తారు – చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణవార్త విన్నప్పుడు చాలా బాధ కలిగిందని అన్నారు. జగన్‌ తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.‘‘మొదట వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం జరిగింది. వెనుక తలుపు తీసుకుని లోపలికి వెళ్లారని చెప్పారు. సాధారణంగా హత్యాస్థలం వద్దకు ఎవరూ వెళ్లకూడదు. శవాన్ని ఎవరు బెడ్ రూమ్ నుంచి బాత్రూమ్ కు తరలించారు? బెడ్‌రూమ్‌లో తలకు గాయమైందని గుడ్డ కట్టారు. అసలు బెడ్‌రూమ్‌ ఎందుకు శుభ్రం చేశారు. గుండెపోటుతో చనిపోయారని పోలీసులను కూడా నమ్మించారు. కేసులు కూడా అవసరం లేదన్నారు.

పోస్టుమార్టంలో హత్య అని తేలిన తరువాత మాట మార్చి నిందలు వేస్తున్నారు. తప్పులు మీరు చేసి నాతో పాటు లోకేశ్‌, తెదేపాపైనా ఆరోపణలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్‌రెడ్డికి హత్య జరిగిన విషయం ఎవరు చెప్పారు? అవినాష్‌రెడ్డి ఎవరెవరికి చెప్పారు?. గంగిరెడ్డి, కృష్ణారెడ్డి సహా ఇతర బంధువులందరూ వెళ్లి ఘటనాస్థలిని చూశారు. జరిగింది హత్య అని ఎందుకు చెప్పలేకపోయారు. ఆస్పత్రిలోనూ సహజ మరణమనే చెప్పారు?. మృతదేహాన్ని చూసినవారెవరైనా హత్యని చెప్పేస్తారు. మెదడు కూడా బయటికి వచ్చేలా గాయం అయితే గుండెపోటు అని ఎలా చెప్పగలిగారు? గుండెపోటు అయితే తలలోంచి రక్తం వస్తుందా? అసలు హత్యను ఎందుకు కప్పిపుచ్చాలని చూస్తున్నారు.. ఇంట్లో వాళ్లు చంపినప్పుడే ఆధారాలు మాయం చేసే ప్రయత్నం జరుగుతుంది అని అన్నారు. ఉదయం లేని లెటర్‌ ఈవెనింగ్‌ ఎలా వచ్చింది” అని సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.ఢిల్లీలో అనుకూల ప్రభుత్వం ఉంది కాబట్టే సీబీఐ విచారణ అడుగుతున్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకుంటే ప్రైవేట్ సైన్యం పెట్టుకుంటారా?” అని నిలదీశారు.

leave a reply