భారత్‌కు అండగా… అమెరికా!

పుల్వామా ఘటనపై ప్రపంచమంతా ముక్త కంఠంతో ఖండిస్తోంది. తాజాగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ ఎలాంటి చర్యలు చేపట్టినా తమ వంతు సహకారం అందిస్తామని అమెరికా తెలియచేసింది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. అమెరికా భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌.. భారత భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌తో ఫోన్లో మాట్లాడి సంతాపం తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ నుంచి పూర్తి మద్దతు ఇస్తామని బోల్టన్‌ ఈ సందర్భంగా తెలిపారు.

పుల్వామా ఘటనపై సంతాపం తెలియజేసేందుకు అజిత్‌ డోభాల్‌తో మాట్లాడాను. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ ఆత్మరక్షణ చర్యలను మేం సమర్థిస్తాం. ఉగ్రవాదులకు పాక్‌ కీలకంగా వ్యవహరించవద్దని ఆ దేశానికి చెబుతూనే ఉన్నాం’ అని బోల్టన్‌ పేర్కొన్నారు.

అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపెయో కూడా ఉగ్రదాడిని ఖండించారు. ‘ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మేం అండగా ఉంటాం. అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారుతున్న ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం ఇవ్వకూడదు’ అని పాంపెయో ట్విటర్‌లో తెలియచేసారు. ఉగ్ర సంస్థలకు ఆశ్రయం ఇవ్వడాన్ని, సాయం అందించడాన్ని తక్షణమే మానుకోవాలని పాకిస్థాన్‌కు అమెరికా గట్టి హెచ్చరిక చేసింది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై భీకర ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.  

leave a reply