ఆగిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్!

భారత మొట్టమొదటి సారిగా ప్రారంభించిన సెమీ హైస్పీడ్‌ రైలు “వందే భారత్ ఎక్స్‌ప్రెస్” మరుసటి రోజే నిలిచిపోయింది. శుక్రవారం దిల్లీ నుంచి వారణాసికి వెళ్లిన రైలు తిరిగి దిల్లీకి వస్తుండగా.. శనివారం ఉదయం మధ్యలోనే ఆగిపోయింది. ఇంజిన్‌ రహిత రైలుగా పేర్కొంటున్న ఈ ఎక్స్‌ప్రెస్‌కు దిల్లీకి 200కి.మీ దూరంలో పశువులు అడ్డుగా రావ‌డంతో చ‌క్రాల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలు ఆపాల్సి వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు.

తిరిగి లోపాలను సవరించడానికి ఎక్కువ సమయం పట్టడంతో అందులోని ప్రయాణికులను ఇతర రైళ్లలో గమ్య స్థానాలకు చేర్చే ప్రయత్నం చేశారు. ఇంజినీర్లు వెంటనే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. మళ్లీ 8:30గంటలకు రైలు దిల్లీకి బయలుదేరింది. దేశీయంగా తయారు చేసిన ఈ రైలు భారత మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ రైలుగా పేరుగాంచింది. ఈ రైలును శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. గంటకు 180కి.మీ వేగంలో ప్రయాణించగల సామర్థ్యమున్న ఈ రైలు  ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో మరో 100 రైళ్ల తయారీకి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ ప్రకటించారు. చెన్నై కోచ్‌ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు అన్ని రకాల అనుమతులను పొందింది.

leave a reply