ఓటములు తెలియకుండా విజయాలతో మంచి ఊపు మీద ఉన్న టీమిండియా హామిల్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ ఐదు పరుగులతో ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోయింది. విజయం కోసం చివరి వరకు పోరాడినప్పటికీ విజయం న్యూజిలాండ్ వైపే నిలిచింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 2-1 తేడాతో కివీస్ వశమైంది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో వదిలేసిన క్యాచ్‌లే టీమిండియా కొంప ముంచాయి. క్యాచ్‌లను ఒడిసిపట్టి ఉంటే ఛేదించాల్సిన లక్ష్యం తగ్గేది. సిరీస్ కైవసం అయ్యేది. కాగా కివీస్ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు 6 పరుగుల వద్దే షాక్ తగిలింది. శిఖర్ ధావన్ (5) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విజయ్ శంకర్ (43; 28 బంతుల్లో 5×4, 2×6) తన ప్రతిభను చాటాడు. అద్భుతమైన సిక్సర్లు బాదేశాడు. రోహిత్ (38; 32 బంతుల్లో 3×4)తో కలిసి రెండో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం అందించి వెనుదిరిగాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (28; 12 బంతుల్లో 1×4, 3×6) వీర విహారం చేశాడు. చూడచక్కని సిక్సర్లతో అలరించాడు. జట్టు స్కోరు 121 వద్ద అతడిని టిక్నర్ ఔట్ చేశాడు. హార్దిక్ పాండ్య (21; 11 బంతుల్లో 1×4, 2×6) సైతం రోహిత్‌తో జత కలిసి స్కోరు బోర్డుకు ఊపు తెచ్చాడు. ఈ క్రమంలోనే రోహిత్, హార్దిక్, ధోనీ (2) వెంటవెంటనే వెనుదిరగడంతో ఓటమి ఖాయమనుకున్నారు.
కానీ, చివర్లో దినేశ్ కార్తీక్, కృణాల్ పాండ్యాల జోడీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన వీరిద్దరూ చివరి వరకు పోరాడుతూ.. విజయంపై ఆశలు కల్పించారు. ఆఖరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సిన తరుణంలో కివీస్ బౌలర్ సౌథీ అత్యద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ కివీస్ సొంతం అయ్యింది. కివీస్ నిలకడైన బౌలింగ్‌కు తోడు న్యూజిలాండ్ ఫీల్డర్లు పకడ్బంధీగా ఫిల్డింగ్ చేయడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు.
భారత ఆటగాళ్లలో విజయ్ శంకర్ 43, రోహిత్ శర్మ 38, దినేశ్ కార్తీక్ 33, రిషభ్ పంత్ 28, కృనాల్ పాండ్యా 26 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్, డారెల్ మిచెల్ తలో 2 వికెట్లు తీశారు.