రాష్ట్రానికి వచ్చి.. అలా అనేసి వెళ్లిపోయారు..!

ప్రధానమంత్రి హోదాలో గుంటూరు పర్యటనకు వచ్చిన నరేంద్రమోడీ.. రాష్ట్రానికి ఏదో చెబుతాడనుకున్న బీజేపీ నేతలకు అదేమి చెప్పలేదు. కేవలం చంద్రబాబుపై తనకు ఉన్న కోపం అంతా తీర్చుకున్నారంతే. తన ప్రసంగంలో ఎనభై శాతం చంద్రబాబును విమర్శించడానికే సమయం కేటాయించిన ప్రధాని ఏపీలో జరిగిన అభివృద్ధి ఏదైనా ఉంటే.. అది తమ ఘనతేనని.. జరగనిది.. ఏదైనా ఉంటే అది చంద్రబాబు వైఫల్యమేనని చెప్పుకొచ్చారు.

కానీ, ఏం చేశారో మాత్రం చెప్పలేదు. సరికదా.. చంద్రబాబు ఏం చేయాలేకపోయారో చెప్పలేదు. తెలుగు మీద ఓ ప్రేమను ఒలకబోస్తూ.. గుంటూరు గొప్పతనాన్ని పొగిడేసి… తాను గుంటూరు నుంచి స్విచ్చాన్ చేసిన.. రెండు చిన్న చిన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల కు చెందిన ప్రాజెక్టుల గురించి పావుగంటకుపైగా మాట్లాడిన మోడీ.. తర్వాత చంద్రబాబు నామస్మరణతో కాలం గడిపేశారు.

చంద్రబాబును.. వెక్కిరించడానికి మోడీ ఎక్కువ సమయం తీసుకున్నారు. మోడీ తనకు సరైన గౌరవం ఇవ్వలేదని చంద్రబాబు చెప్పడాన్ని ఆయన మరింత ఎగతాళి చేసేలా మాట్లాడారు. చంద్రబాబు.. వెన్నుపోటు రాజకీయాల్లో సీనియర్ అని.. పార్టీ ఫిరాయింపులు చేయడంలో, కొత్త కూటములు కట్టడంలో సీనియర్ అని మండిపడ్డారు. ఎవర్ని తిడతారో.. వారి ఒళ్లో కూర్చోవడంలో, మాటలు మార్చడంలో చంద్రబాబు సీనియర్ అని విమర్శలు గుప్పించారు. అభివృద్ధి , ప్రజాసంక్షేమంలో తానే గొప్ప అని ప్రకటించుకున్నారు. ఏపీని మారుస్తానని చెప్పి.. చంద్రబాబే మారిపోయారు. యూటర్న్ తీసుకున్నారని.. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

అమరావతిని గొప్పగా నిర్మిస్తానని చెప్పి… టీడీపీని నిర్మించుకునే పనిలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు ఏ పథకాలు పెట్టలేదని.. ఆయన అమలు చేస్తున్న పథకాలన్నీ కేంద్రానివేనని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారంటూ కంచికి పోయిన ఓ పాత కథను మళ్లీ చెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసిన తీరు చూస్తే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందని బాధపడిపోయారు. మళ్లీ గెలవలేమోననే ఆందోళనతో చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.

సభలను మా పార్టీ సభను కార్యకర్తలు ఇచ్చిన డబ్బులతోనే ఏర్పాటు చేశామని.. కానీ చంద్రబాబు ప్రజల డబ్బుతో ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి నన్ను తిట్టే ముందు ప్రజలకు ఖర్చులపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదో ఇబ్బందితోనే తప్పించుకోవడానికి చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని తనదైన కోణంలో విశ్లేషించుకున్నారు.

ఏపీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామమని.. ఏపీకి ఏమైనా ఇబ్బంది జరిగితే అది ఏపీ ప్రభుత్వం వల్లేనని తీర్పు చెప్పారు కూడా. కేంద్రంలో వివిధ శాఖల ద్వారా రూ. 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. పదేళ్లలో నెరవేర్చాల్సిన విభజన హామీలను నాలుగున్నరేళ్లలో నెరవేర్చామనే కొత్త విషయాన్ని భారత ప్రధాని గుంటురు సభలో తడబడకుండా చెప్పారు. ప్యాకేజీకే కేంద్రం కట్టుబడి ఉందని, మేము కమిట్‌మెంట్‌తో ఉన్న ఉపయోగించుకోవడం చంద్రబాబుకి చేతకాలేదని తీర్మానించేసి తనకు మాత్రమే..సాధ్యమైన నాటకీయమైన హావభావాలతో ప్రసంగాన్ని నడిపించారు. ఆయన భాష గుంటూరు ప్రజలకు తెలియక పోవడంతో జీవీఎల్ తర్జుమా చేయడం.. అందులో గ్రాంధీక భాషలో ఉంటుంది కాబట్టి.. అక్కడి జనం అంతా డబ్బింగ్ సినిమా చూస్తున్నట్లుగా ప్రసంగాన్ని గుంటూరు ప్రజలు ఆస్వాదించారు. మోడీ హావభావాల్లో తేడా కనిపించినప్పుడు వెంటనే చప్పట్లు కొట్టారు.

leave a reply