గది ఖాళీగా ఉందా..? మార్చేయండి..ఇలా!

గదిలో ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ‘లాఫ్టెడ్‌ డిజైన్‌’ ఒక చక్కని మార్గం. దీనివల్ల గదులు ఆధునికంగా కనిపించటమే కాదు.. ఇంట్లోని ఖాళీ ప్రదేశాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి, గదిలో ఆహ్లాదాన్ని సృష్టించటానికి పలు మార్గాలను చూపుతుంది. గదులకు విలాసవంతమైన డిజైనింగ్‌ చేయటంలో గోడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఫ్యాబ్రిక్‌, త్రీడీ బోర్డ్‌, రకరకాల చిత్రాలతోనూ లేదా మెటల్‌, మార్బుల్‌ పలకలతోనూ గోడల ఉపరితలాన్ని కవర్‌ చేయటం ద్వారా విలాసవంతంగా కనిపిస్తాయి.

గదిలో ఉండే స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే వివిధ రకాల ఆకృతులు, ఫీచర్లతో ఉండే వస్తువులను ఉపయోగించుకోవాలి. దీనికి అలమరాలు చక్కగా ఉపయోగపడతాయి. వాడటం సులభం. శుభ్రంగా ఉంచితే గదికి కొత్త అందాల్ని అద్దుతాయి. సాధారణంగా లైట్లు అనగానే కాంతికోసం అనే దృష్టితో చూస్తారు కానీ, గది వాతావరణానికి వీటితో లగ్జరీ లుక్‌ తీసుకురావొచ్చు. రకరకాల లైట్లను వాడటం ద్వారా గదిలో రకరకాల వేరియంట్స్‌ను సృష్టించొచ్చు.

గోడలకు ఎక్కువ సంఖ్యలో అద్దాలు అమర్చటం ద్వారా గది విశాలంగా కనిపిస్తుంది. గదిని బట్టి కూడా అద్దాలను ఏర్పాటు చేసుకోవచ్చు. చేంజింగ్‌ రూమ్‌ అయితే హృదయాకారం, నక్షత్రాల ఆకారంలో ఉండే అద్దాలను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల ఆ గది అందం రెట్టింపు అవుతుంది. వాల్‌పేపర్లు గదిలో ఉండే స్థలానికి మంచి లుక్‌ను తెస్తాయి. మీకు బాగా ఇష్టమైన డిజైన్‌ను ఎంచుకోండి. గదిని చూడగానే కలిగే ఫీల్‌పై బ్యాగ్రౌండ్‌ కలర్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బెడ్‌రూమ్‌ కోసం లేత తేలికపాటి రంగులు ఎంచుకోవటం వల్ల ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంటుంది.

ఉల్లాసపరిచే లగ్జరీ లుక్‌ కోసం గదుల్లో ఫర్నిచర్‌ను వాడొచ్చు. రోజువారీ ఫర్నిచర్‌తోనే గదిలో ప్రదేశానికి కొత్త రంగులు అద్దొచ్చు. సరైన విధానంలో చేయాలేగానీ బెడ్‌ లేదా దివాన్‌కు ఉండే దిండు, పరుపులతోనే విలాసవంతమైన లుక్‌ను తేవొచ్చు. అవకాశాన్ని బట్టి కొన్ని ప్రయోగాలూ చేయవచ్చు. పోర్షన్‌లో కొంత భాగానికి ఎల్‌సీడీ రూఫ్‌ ప్యానెల్‌ను పైకప్పుగా వాడొచ్చు. ఇది చూడటానికి అందంగా ఉండటమే కాదు పగలు గదిలో చక్కగా వెలుతురు పరుచుకుంటుంది. రాత్రిళ్లు నక్షత్రాలు కనువిందు చేస్తాయి. మీ వస్తువుల కోసం కొంచెం స్థలాన్ని ప్రత్యేకంగా అట్టిపెట్టుకోవాలి. అవసరమైతే చదువుకోవటానికి, పనిచేసుకోవటానికి ఏకాంతం కోసం ఆ ప్రత్యేక స్థలాన్ని వాడుకోవచ్చు.

leave a reply