పుల్వామా దాడి గురించి.. ముందే తెలిసిందా?

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడికి ప్లాన్‌ చేసినట్లు ముందుగానే తెలిసిందా! జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్ర క్రిమినల్ ఇన్విస్టిగేష‌న్ డిపార్ట్‌మెంట్(సీఐడీ) అధికారులు అందించిన స‌మాచారాన్ని ఇంటెలిజెన్స్ పట్టించుకోలేదా!  దాడి జరగడానికి రెండు రోజుల ముందు ట్విటర్‌లో ఓ వీడియో హల్‌చల్‌ చేసింది. ఇదే విషయాన్ని జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఇంలిటెజెన్స్‌ వర్గాలకు ముందే వివరించినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే 44 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని అంటున్నారు. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌ను లక్ష్యంగా చేసుకుని జైషే మహ్మ‌ద్ సంస్థ ఉగ్ర‌వాది దాడికి పాల్ప‌డ్డాడు.

ఉగ్రవాదులు కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి చేసేందుకు ఏడాది ముందు నుంచే ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రైవేట్‌ ట్విటర్‌ ఖాతాలో ఆత్మాహుతి దాడికి సంబంధించిన 33 సెకన్ల వీడియో రెండు రోజుల క్రితం ట్విటర్‌లో కనిపించింది. అందులో సోమాలియా భద్రతా సిబ్బందిపై జేఈఎం ఉగ్రవాదులు దాడి చేసినట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా అదే తరహాలో కశ్మీర్‌లోనూ దాడి జరగొచ్చని సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ వీడియోతో పాటు మ‌రింత స‌మాచారాన్ని కూడా ఇంటెలిజెన్స్‌కు చేర‌వేశార‌ట‌. అయితే ఆ స‌మాచారాన్ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు పట్టించుకోకపోవడమే గమనార్హం.

శ్రీన‌గ‌ర్‌కు భారీ సంఖ్య‌లో జ‌వాన్లు వెళుతున్న‌ట్టు ఉగ్ర‌వాదుల‌కు ముందుగానే తెలియ‌డం, ఘ‌టన జ‌రిగిన ప్రాంతానికి కేవలం ప‌ది కిలోమీట‌ర్ల దూరంలోనే నివాసం ఏర్పాటు చేసుకొని జవాన్ల రాకను ముందుగానే పసిగట్టిన ఉగ్రవాది ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు సమాచారం.

leave a reply