శనిదోషాలు నివారించే స్వామి

తెలంగాణ రాష్ట్రంలోని నరసింహ దేవాలయాల్లో ముఖ్యంగా ప్రసిద్ధి చెందినవి ఒకటి యాదాద్రి, ఆ తర్వాత నిజామాబాద్‌ జిల్లాలోని జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కాకతీయుల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి పొందాడు. శనిదేవుడి నీడ తన భక్తులపై పడకుండా కాపాడుతాడని భక్తుల నమ్మిక. నాభిలో సాలగ్రామాన్ని ధరించిన ఈ స్వామి శివకేశవుల మధ్య అభేదాన్ని తెలుపుతుంది.

చరిత్ర ప్రకారం.. తన తండ్రి పెడుతున్న హింసల నుంచి బాలుడైన భక్త ప్రహ్లాదుడిని రక్షించేందుకు ఆ శ్రీమన్నారాయణుడే నరసింహుడి అవతారం ఎత్తుతాడు. హిరణ్యకశ్యపుడిని సంహరించిన అనంతరం స్వామి ఆ ఉగ్రరూపంలోనే సంచరిస్తూ జానకంపేట దండకారణ్యానికి చేరుకుంటాడు. అక్కడి ఆహ్లాదవాతావరణానికి ముగ్ధుడైన నారసింహుడు అక్కడే సేదతీరుతాడు. ఆ అరణ్యంలోనే తపస్సు చేసుకుంటున్న రుషులు స్వామి ఉగ్ర రూపాన్ని చూసి భీతిల్లుతారు. అనంతరం స్వామిని మామూలు స్థితికి తీసుకొచ్చే మార్గాన్ని ఉపదేశించమని బ్రహ్మదేవుడిని ఆశ్రయిస్తారు. బ్రహ్మ సూచనమేరకు గండకీ నదీతీరంలోని సాలగ్రామాన్ని తీసుకొచ్చి స్వామి నాభి దగ్గర ఉంచగా, శాంతించిన స్వామి అక్కడే లక్ష్మీనరసింహుడిగా వెలిశాడని స్థలపురాణం.

ఇక్కడున్న ఈ స్వామిని దర్శించుకుంటే శనిదేవుని దోషాలు పోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ప్రతి నెలా స్వాతి నక్షత్రంలో స్వామి వారికి కళ్యాణం చేస్తారు. అలాగే.. బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. స్వామి నాభిలో సాలగ్రాసం ఉండటం ఈ స్వామి ప్రత్యేకత. ఏటా.. ప్రబంధ పారాయణం, స్థపనం, మాతృకాపూజ, రక్షాబంధనం, అంకురార్పణ, శాలప్రతిష్ఠ, వాస్తుహోమం, కల్యాణం, రథోత్సవాలు ఉంటాయి. ఈ ఆలయానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటున్నారు.

leave a reply