అడ్డుపడ్డారు.. క్లాస్ పీకి వదిలిపెట్టాడు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన… నిరసనలు జరుగుతాయన్న భయంతో వాయిదా పడిందన్న ఆక్రోశం.. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఎక్కువగానే ఉండి ప్రతీకార చర్యలకు పాల్పడాలనుకున్నారో ఏమో కానీ, కాకినాడలో జన్మభూమి కార్యక్రమలో పాల్గొనేందుకు వెళ్లిన … ముఖ్యమంత్రిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

కాకినాడ నాగమల్లితోట జంక్షన్‌ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌ను భారతీయ జనతా పార్టీ నేతలు అడ్డుకుని సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని లాగి పడేశారు… అయితే చంద్రబాబు మాత్రం కాన్వాయ్ ఆపి మరీ వారికి క్లాస్ పీకారు. మీరు ఈ రాష్ట్రంలో పుట్టలేదా అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి మోడీ ఏం చేశారని వారిని వెనకేసుకొస్తున్నారని, రాష్ట్రంలో ఉండేందుకు బీజేపీ నేతలకు అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయాన్ని మీరు సమర్థిస్తారా అని, రాష్ట్రాన్ని, దేశాన్ని మోదీ ముంచేశారని విమర్శలు గుప్పించారు.

కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులే పక్కనకు తీసుకెళ్లి కాసేపటి తర్వాత వదిలేస్తారని.. కాస్తంత పబ్లిసిటీ వస్తుదందని భారతీయ జనతా పార్టీ నేతలు అనుకున్నారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు కాన్వాయ్ ఆపి .. బస్సు మెట్ల మీద నుంచి… క్లాస్ పీకారు. వారి ఎదుటే.. వారినే కాదు.. నరేంద్రమోడీపై.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. దీంతో.. పని గట్టుకుని చంద్రబాబుతో విమర్శించుకోవడానికి ప్రత్యేకంగా కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశామేమో అని వారు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది.

జనవరి ఆరో తేదీన నరేంద్రమోడీ ఏపీ పర్యటనకు రావాల్సి ఉంది. అయితే… వైసీపీ, జనసేన మినహా అన్ని పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు అన్నీ.. నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వడంతో.. ఆకస్మిక పర్యటనలు ఉన్నందున రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. అప్పుడే బీజేపీ నేతలు.. తాము చంద్రబాబును అడ్డుకుంటామని ప్రకటించారు.

కాకినాడలో… బీజేపీకి కొంత మంది కార్యకర్తలు ఉండటంతో వారిని అడ్డుకోవడానికి పంపించారు. అది ఇలా రివర్స్ అవుతుందనుకోలేదు. నిజానికి బీజేపీ నేతలను గతంలో కొంత మంది అడ్డుకున్నప్పుడు.. వాళ్లను వెంటబడి మరీ కొట్టారు. కానీ.. ఈ సారి ఏకంగా వాళ్లు చంద్రబాబు కాన్వాయ్ నే అడ్డుకున్న ఎలాంటి దాడులకు గురి కాలేదు. నేరుగా చంద్రబాబు క్లాస్ విని ఇంటికెళ్లిపోయారు.

leave a reply