అలా కూర్చుంటే కష్టమే!

ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో దాదాపు ప్రతి ఉద్యోగానికీ కంప్యూటర్‌పై పనిచేయడం తప్పట్లేదు… అయితే ముఖ్యంగా యువతరానికి పని చేస్తున్నంత సేపు  కంప్యూటర్‌ ముందు కూర్చోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా అలసట, తలనొప్పి, కండరాల మీద ఒత్తిడి ఎక్కువగా వచ్చే సమస్యలు. శాన్‌ఫ్రాన్‌సిస్కో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కుర్చీలో నిటారుగా కూర్చోవడం వల్ల వెన్నెముక కండరాలుఫై  మెడ, తల బరువు ఎక్కువగా పడడంతో మెడ కండరాలు దాదాపుగా 5 కిలోల బరువును మోస్తున్నాయట. అలాకాకుండా తలను వంచి కూర్చుంటే మెడ భాగంపై అదనపు బరువు పడుతుందని చెబుతున్నారు. సరిగ్గా కూర్చోకపోవడం వల్ల మెడ, తల భాగం మీద 20 కిలోల అదనపు బరువు పడుతుందట. దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయట.

ఈ అధ్యయనంలో భాగంగా 87 మంది విద్యార్థుల మీద పరిశోధనలు చేయగా,  వీరిలో ఎక్కువ శాతం మంది తల, మెడ, కళ్లు నొప్పి వచ్చిందని తెలిపారట. వారిలో 12 మంది విద్యార్థులను ఎలక్ర్టోమయోగ్రఫీ పరికరం ద్వారా పరిశీలిస్తే… తలను ముందుకు కదిలించినప్పుడు మెడ వెనక భాగంలో ఉండే ట్రపేజియస్‌ కండరం మీద ఒత్తిడి పడినట్లు పరిశోధకులు తెలిపారు. దీనికోసం కంప్యూటర్‌పై ఎక్కువ సేపు సమయం కేటాయించేవారు  తల, మెడ ఒకే పొజిషన్‌లో ఉంచి పని చేసుకోవాలని తెలిపారు. స్ర్కీన్‌ మీద కనిపించే అక్షరాలను పెద్దగా చేసుకోవడం, కంప్యూటర్‌ను కళ్లకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అవసరమైతే అద్దాలను వినియోగించాలని పేర్కొన్నారు.

leave a reply