ఇదేం.. మర్యాద..?

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, అధికారులపై గవర్నర్ నరసింహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, ఆయన కుటుంబసభ్యులు సోమవారం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. గవర్నర్‌ దంపతులకు అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభం స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం, అక్కడి ఉత్సవ మండపంలో గవర్నర్ దంపతులకు ప్రధానార్చకులు, వేదపండితులు తూతూ మంత్రంగా ఆశీర్వచనం నిర్వహించారు.

దీంతో, వారి తీరుపై గవర్నర్ మండిపడ్డారు. ‘ఇదేం ఆశీర్వచనం? చతుర్వేద ఆశీర్వచనం చేయాలి కదా? ఆలయంలో ప్రథమ పౌరుడికి ఆశీర్వచనం జరిపే తీరు ఇదేనా? ఇందుకు సంబంధించిన పరిజ్ఞానం నాకు ఉంది కనుక గుర్తించాను. వేరే వారికి ఇలా చేయడం మంచిపద్ధతి కాదు’ అని వారిని గవర్నర్ హెచ్చరించారు. కాగా, ఈ విషయమై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆలయ ఈవో, వైటీడీఏ వైస్ చైర్మన్ ని గవర్నర్ ఆదేశించినట్టు తెలుస్తోంది.

leave a reply