మాల్యాకు ఇక…తిప్పలు తప్పవా!

బ్యాంకులకు కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టి  విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్‌ మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరగాడిగా కోర్టు ప్రకటించింది. ముంబయిలోని పీఎంఎల్‌ఏ  న్యాయస్థానం శనివారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టారని కోర్టు తేల్చింది. మాల్యాకు పారిపోయిన ఆర్థిక నేరగాడి ట్యాగ్‌ ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పీఎంఎల్‌ఏ న్యాయస్థానంలో గతంలో పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ విచారించిన న్యాయస్థానం ఈడీకి అనుకూలంగా దేశ విదేశాలలో ఉన్న మాల్యా ఆస్తులను సీజ్ చేయడానికి ఈడీకి అనుమతి ఇచ్చింది. దీనితో మాల్యాకు సంబంధించిన ఆస్తులన్నీ  ప్రభుత్వం జప్తు చేసుకోవచ్చు. 2018 ప్రకారం ఈ విధంగా నేరస్థుడిగా ప్రకటించబడిన మొదటి వ్యాపారవేత్త మాల్యాయే అవడం విశేషం.

కానీ.. గత కొంతకాలంగా తాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడ్ని కాదని ఇంతకుముందే  మాల్యా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కానీ అక్కడ కూడా మాల్యాకు ఎదురుదెబ్బే తగిలింది. మాల్యాపై ఎటువంటి తప్పుడు కేసులు పెట్టినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని , అందువల్ల భారత్‌లోని కోర్టులకు మాల్యా సమాధానం చెప్పాలని లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు చీఫ్‌ మేజిస్ట్రేట్‌ జడ్జి ఎమ్మా ఆర్బత్‌నాట్‌ వ్యాఖ్యానించారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన మాల్యాను భారత్‌కు అప్పగించాల్సిందిగా లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ న్యాయస్థానం గత నెల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మాల్యా ఆస్తులను అనుసంధానం చేయడానికి యూకే కోర్టు అనుమతి ఇచ్చింది.

leave a reply