ఎన్నికల వేళ…. కదలబోతున్న కుర్చీలు..!

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే వివిధ జిల్లాల్లో ధీర్ఘకాలికంగా పాతుకుపోయిన అధికారుల కుర్చీలు, కదలబోతున్నాయి. మూడేళ్లు సర్వీసు దాటిన వారందరినీ ఎన్నికల నియమావళి మేరకు బదిలీ చేయడం ఖాయం. ఇప్పటికే అటువంటి అధికారుల జాబితా జిల్లాల వారీగా తయారు చేయటం జరిగింది. అదే విధంగా ఉద్యోగుల సర్వీసులు కూడా మూడేళ్లు దాటితే బదిలీ చేసే అవకాశం ఉంది.

గత ఎన్నికల్లో అదే జిల్లాల్లో పనిచేసినా, స్థానికులైనా, ఆయా అధికారులను బదిలీకి అర్హులుగా తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. జిల్లాలో ఎంపిడిఒలతో పాటు..ఇతర రెవిన్యూ అధికారులు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. జిల్లా జడ్పీ సిఇఒలు, కలెక్టర్లు అటువంటి ఉద్యోగుల జాబితాను రూపొందించడంలో మునిగిపోయారు.

ఎండిఒలు, తాసిల్దార్లు ఒకేమండలంలో గత నాలుగేళ్ల నుంచిపనిచేసిన వారెందరో ఉన్నారు. అదే విధంగా అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులుగా ఎవరెవరు బాధ్యులుగా పనిచేశారో వారికి మళ్లీ అవకాశం ఇవ్వరు. అందులో సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, పంచాయితీరాజ్ అధికారులు ఉన్నారు. వివిధ జిల్లాల నుండి ఈ అధికారుల జాబితా తయారైందని, వీరి జాబితాను ఎన్నికల కమీషన్ కు పంపించడం జరిగిందని ప్రచారం జరుగుతోంది.

ఒకే జిల్లాల్లో, ఒకే మండలంలో పనిచేస్తోన్న తాసిల్దార్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వారందరినీ ఇతర జిల్లాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. అందుకేనేమో ఈ మధ్య కాలంలో తాసిల్దార్లు తమను ఫలానా జిల్లాకు బదిలీ చేయాలని స్వయంగా కలసి కోరుతున్నారు. అధికార పార్టీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులను, తమ నియోజకవర్గంలో నియమించాలని కొంత మంది అధికారులు, ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఇదే విషయంపై కొంత మంది జిల్లా కలెక్టర్లను సంప్రదించగా, ఎన్నికల నిబంధనల మేరకు ఎటువంటి ఒత్తిడిలకు తలగ్గే అవకాశం లేదని వారు కోరుకున్న జిల్లాలకు బదిలీ చేయడం అనే విషయంపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది.

ఇంతకు ముందు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తాసిల్దార్లను, ఇతర శాఖల అధికారులను కూడా ఈసారి బదిలీ చేయాలని ఎన్నికల కమీషన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల అనేక మంది ఆర్డీఓలను బదిలీ చేసి, వారి స్థానంలో కొత్త వారిని నియమించడంతో, వారి స్థానంలో కొత్తవారిని నియమించాల్సి వస్తోంది.

ఏది ఏమైనా సంవత్సరాల తరబడి తిష్టవేసిన అధికారుల కుర్చీలు కదలబోతున్నాయి. మళ్లీ టిడిపి అధికారంలోకి వస్తే…ఇప్పుడు బదిలీ చేసిన అధికారులు మళ్లీ అదే జిల్లాకు రావడం ఖాయం . ఒకవేళ ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే పరిస్థితులుమరో విధంగా ఉంటాయి. ఎవరెవరివి, ఏయే కారణాలతో..ఏయే నియోజకవర్గాలకు బదిలీ చేసే అవకాశం ఉందో మరో నెల రోజుల్లో బయటకు రానుంది.

leave a reply