ఐపీఎల్ వేలం.. కొత్త వాళ్లకు పండగే..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2019 వేలంలో కొత్త కోటీశ్వరులు పుట్టుకొచ్చారు. సీనియర్లు, ప్రముఖులు, గతకాలపు గణాంకాలను ఫ్రాంచైజీలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడెలా ఆడుతున్నారు అనేది పరిశీలిస్తున్నారు. జయపురలో జరుగుతున్న వేలంలో కొత్త కుర్రాళ్లకు గిరాకీ బాగుంది. వారిని దక్కించుకొనేందుకు యాజమాన్యాలు కోట్ల రూపాయాలు ఖర్చుచేసేందుకు వెనుకాడటం లేదు.

తమిళనాడు కుర్రాడు వరుణ్‌ చక్రవర్తి జాక్‌పాట్‌ కొట్టేశాడు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో మధురై తరఫున ఆడిన ఈ మిస్టరీ స్పిన్నర్‌ కోసం ఫ్రాంచైజీలు ఊహించని విధంగా పోటీపడ్డాయి. చివరికి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ.8.40 కోట్లతో అతడిని దక్కించుకుంది. అనుకున్నట్టే ముంబయి బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే మంచి ధర పలికాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.5 కోట్లతో జట్టులోకి తీసుకొంది. దేశవాళీ క్రికెట్‌లో శివమ్‌ దూబే చిచ్చరపిడుగులా చెలరేగుతాడు. ముంబయి టీ20 లీగ్‌లో ప్రవీణ్‌‌ తంబే ఓవర్‌లో ఏకంగా ఐదు సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. వేలానికి ముందు రోజు బరోడాతో రంజీ మ్యాచ్‌లో స్వప్నిల్‌ సింగ్‌ ఓవర్‌లో వరుసగా ఐదు భారీ సిక్సర్లు బాదేశాడు. చివరి బంతి వైడ్‌ వేయడంతో సిక్సర్‌కు అవకాశం దక్కలేదు. అతడి ఫిట్‌నెస్‌ సైతం బాగుంది.

గతేడాది ఎడమచేతి వాటం పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ కోసం రూ.11 కోట్లు పైగా వెచ్చించింది రాజస్థాన్‌ రాయల్స్‌. ఆ స్థాయి ప్రదర్శన చేయకపోవడంతో విడుదల చేసింది. వేలంలో తక్కువ ధరకు దక్కించుకోవాలని ప్రణాళిక వేసింది. వేలంలో అతడికి మళ్లీ ఊహించని ధర లభించింది. రాజస్థాన్‌ మళ్లీ భారీగానే రూ.8.4 కోట్లు ఖర్చు చేసింది. ఇంగ్లాండ్‌లో కోహ్లీసేనకు టెస్టు సిరీస్‌ దూరం చేసిన యువ ఆల్‌రౌండర్‌ శామ్‌ కరన్‌ను మరిచిపోలేం. అద్భుత నైపుణ్యాలున్న ఈ ఆల్‌రౌండర్‌ కోసం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ.7.2 కోట్లు ఖర్చుపెట్టింది. కొలిన్‌ ఇన్‌గ్రాం (రూ.6.4 కోట్లు)ను దిల్లీ క్యాపిటల్స్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (రూ.5 కోట్లు)ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, అక్షర్‌ పటేల్‌ (రూ.5 కోట్లు)ను దిల్లీ క్యాపిటల్స్‌, మోహిత్‌ శర్మ (5 కోట్లు)ను చెన్నై సూపర్ కింగ్స్‌ దక్కించుకున్నాయి.

టీమిండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మను అదృష్టం వరించింది. దిల్లీ క్యాపిటల్స్‌ రూ.1.1 కోట్లు పెట్టి అతడిని కొనుగోలు చేసింది. పేసర్‌ మహ్మద్‌ షమి (రూ.4.8 కోట్లు), వెస్టిండీస్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ పూరన్‌ (రూ.4.2 కోట్లు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (రూ.25 లక్షలు)ను కింగ్స్‌ ఎలెవన్‌ దక్కించుకుంది. శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ (రూ.2 కోట్లు) తిరిగి ముంబయి ఇండియన్స్‌ వద్దకే చేరాడు. వెస్టిండీస్‌ హెట్‌మైయిర్‌ (రూ.4.2 కోట్లు)ను బెంగళూరు దక్కించుకుంది. స్పిన్‌ బౌలింగ్‌లో అతడు విధ్వంసకర షాట్లు ఆడతాడు. ఇంగ్లాండ్‌ టెస్టు కీపర్‌ జానీ బెయిర్‌స్టో (రూ.2.2 కోట్లు), వృద్ధిమాన్‌ సాహా (రూ.1.2)ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తీసుకుంది.

leave a reply