శ్రీశైల ‘మల్లికార్జునభ్రమరాంబ’లు

‘శ్రీశైలం’ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చెప్పబడుతుంది. శ్రీశైల మల్లికార్జున స్వామిగా పూజలందుకుంటున్నాడు కరుణామయుడు సాంబశివుడు. శ్రీశైలం అతిపురాతనమైన క్షేత్రంగా చెప్పబడుతుంది. ఇక్కడ ఆలయంలో ఉన్న శాసనాల్లో ఆధారంగా ఈ ఆలయం క్రీ.శ.6వ శతాబ్ది నాటిదిగా చెప్పబడుతున్నది. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులోని ప్రాంతంలో కలదు. ప్రకృతి అందాల నడుమ నల్లమల్ల అడువుల మధ్య శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం దర్శనమిస్తుంది.. అలాగే.. శ్రీశైలం శివుడికి చాలా ఇష్టమైన ప్రాంతముగా కూడా చరిత్ర ప్రకారం వెల్లడవుతుంది.

చరిత్ర ప్రకారం.. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం శ్రీశైలం. ఇక్ష్వాకులు, పల్లవులు, చాలుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం శ్రీశైలం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు.

శ్రీశైలంలో దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివుడికి గల 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడున్న పాతలగంగలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోయి మోక్షం సిద్ధింస్తుందని భక్తులు భావిస్తారు.

ఆలయం శ్రీశైలం చుట్టు ప్రక్కల దాదాపు అయిదు వందల వరకూ శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాలలో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు,మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలున్నాయి. అలాగే.. శివరాత్రికి ఆలయంలో దైవకళ సంతరించుకుంటుంది. ప్రత్యేక పూజా విధానాలు, దీపాళాంకరణలు నిర్వహిస్తారు. స్వామి వారికి బ్రహ్మోత్సవాలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అలాగే దసరా రోజుల్లో అమ్మవారికి అలంకారాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివరాత్రి సమయాల్లో లక్షల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు.

leave a reply