శ్రీ ధ్యానాంజనేయ స్వామి

అర్థరాత్రి సడన్‌గా చిన్నపిల్లలు నిద్రలో ఉలిక్కి పడి లేస్తూ ఉంటారు. వారి భయం పొగొట్టేందుకు తల్లిదండ్రులు ఆంజనేయస్వామిని తలుచుకో అని చెప్పి నిద్రపుచ్చుతారు. కారణం.. భూత, ప్రేత, పిశాచ భయాలను స్వామి పోగొడతాడని నమ్మకం. నిత్యం రామ ధ్యానంలో వుండే ఆయనను స్మరిస్తే అన్ని రకాల బాధల నుండి విముక్తి చేస్తాడని.. మనకు అండగా ఉంటాడని భక్తుల నమ్మిక.

అలా హైదరాబాదులో ధ్యానముద్రలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి అవతరించిన క్షేత్రమే కర్మన్‌ఘాట్‌ ఆలయం. వందల ఏళ్ల నుంచి భక్తులను దీవిస్తూ ధ్యానముద్రలో వున్న స్వామిని దర్శనం చేసుకుంటే అన్ని అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సంతానం లేనివారు స్వామిని దర్శించి నిండు మనస్సుతో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు.

ఒక చరిత్ర ప్రకారం స్వామి.. క్రీ.శ. 1148లో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే రెండో ప్రతాపరుద్రుడు వేటకు అడవికి బయలుదేరతాడు. చాలా సేపు వేటాడిన అనంతంరం అలసి అక్కడ ఉన్న ఒక రాయిపై విశ్రమిస్తాడు. కాసేపటికి అతనికి పులి గాండ్రింపు శబ్దాలు వినిపించడంతో అప్రమత్తుడై లేచి కూర్చుంటాడు. మళ్లీ శబ్దం రాకపోవడంతో మళ్లీ విశ్రమిస్తాడు. కాసేపటికి మళ్లీ పులి గాండ్రింపు వినరావడంతో తిరిగి గాలిస్తాడు. అప్పుడు కూడా ఎలాంటి జంతువు కనిపించలేదు. అదే సమయంలో రామశబ్దం రావడంతో చేతులు జోడించి ఆ అదృశ్యమూర్తిని ప్రార్థిస్తాడు. ధ్యానం చేస్తే దర్శనమిస్తానని ఆ మూర్తి స్వరం వినిపిస్తుంది. దీంతో రాజు అక్కడ ఏకాగ్రతతో ధ్యానం చేస్తాడు. కొద్దిసేపటికి ఇక లే నాయనా అంటూ స్వరం వినిపించడంతో రాజు కళ్లు తెరిచి ఆ శబ్దం వచ్చిన చోట వెతకగా ధ్యానాంజనేయస్వామి విగ్రహం లభ్యమైంది. పరమానందభరితుడైన రాజు ఆ విగ్రహానికి పూజలు చేసి కోటకు తిరిగి వెళ్లిపోతాడు. ఆ రాత్రి కలలో స్వామివారు అతనికి ప్రత్యక్షమై తనకు ఆలయం నిర్మించమని ఆదేశిస్తారు. స్వామి ఆదేశం ప్రకారమే ప్రతాప రుద్రుడు ఆలయం నిర్మించి తన జన్మ సార్థకం చేసుకుంటాడు. ఈ ఆలయాన్ని ఏటా వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తూ ఉంటారు. రోజూ వందలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. కోరిన కోర్కెలు స్వామి తీర్చుతాడని భక్తుల నమ్మకం.

leave a reply