ఢిల్లీ నడిబొడ్డులో వైసీపీ ‘వంచనపై గర్జన’

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాయే సంజీవని అని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. గురువారం ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్ష ద్వారా ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా దేశ రాజధాని నడిబొడ్డున జంతర్‌మంతర్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ పోరాటం చేసింది.

ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్న వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ దీక్ష చేపట్టినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. విభజన హామీలపై నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ హోదా సాధన కోసం ఇప్పటికే పలుమార్లు ఏపీలోని వివిధ జిల్లా కేంద్రాల్లో వంచనపై గర్జన దీక్షలు నిర్వహించింది.

అంతేకాకుండా పార్టీకి చెందిన ఎంపీల చేత వారి లోక్‌సభ సభ్యత్వాలకు కూడా రాజీనామాలు సమర్పించి ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను చాటి చెప్పారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు యూ టర్న్‌ తీసుకుని ఏపీ తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని తెలుగు జాతి మొత్తం కోరుకుంటుందని తెలిపారు.

హోదా కోసమే వైఎస్సార్‌ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా జననేత వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.దీక్ష ప్రారంభానికి ముందు వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసంలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ దీక్షలో వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గురువారం సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగింది.

leave a reply