తెలంగాణ కాంగ్రెస్… ఏమయింది నీకు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ బాగా త‌గ్గింది. ఎంత‌గా అంటే… ఓట‌మిపై ఇంత‌ వ‌ర‌కూ ఆ పార్టీ నేత‌లు లోతుగా విశ్లేషించుకోకుండనంతగా.. ఏ పార్టీ అయినా.. గెలిస్తే సంబ‌రాలు చేసుకోవ‌డం, ఓడిన కార‌ణాల‌ను విశ్లేషించుకోవ‌డం అనేది సహ‌జంగా జ‌రుగుతాయి. అరవై సంవత్సరాల సూధీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్‌కి గెలుపోట‌ములు కొత్తేమి కాదు.  అయితే, అసెంబ్లీ ఎన్నికల త‌రువాత పార్టీ రెగ్యుల‌ర్ కార్య‌క్ర‌మాల‌ను పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నిర్వహించడం లేద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

సీఎల్పీ స‌మావేశాన్ని ఏర్పాటు చేసి, ఓట‌మి కార‌ణాల‌పై చ‌ర్చిస్తే బాగుండేద‌నే అభిప్రాయం కొద్దిమంది సీనియ‌ర్ల నుంచి వినిపిస్తోంది. ఎన్నిక‌లు జ‌రిగి కొన్నాళ్లే అయింది క‌దా, కాస్త విరామం తీసుకుని తీరిగ్గా అన్నీ చ‌ర్చించుకుందామ‌నే ప‌రిస్థితి ఇప్పుడు టి. కాంగ్రెస్ కి లేదు.

ఎందుకంటే, త్వ‌ర‌లోనే పంచాయ‌తీ ఎన్నిక‌లు, వెంటనే జాతీయ పార్టీకి అత్యంత కీల‌క‌మైన లోక్ స‌భ ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. ఈ త‌రుణంలో పార్టీ శ్రేణుల‌కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ దిశ‌గా ఉత్త‌మ్ ప్ర‌య‌త్నం చేయ‌డం లేద‌నే అభిప్రాయం వినిపిస్తోంది!

గెలిచిన‌వారితో సీఎల్పీ స‌మావేశం పెట్టాల‌న్నా కూడా… హైక‌మాండ్ నుంచి ఎవ‌రో ఒక‌రు వ‌చ్చే వర‌కూ ఆయ‌న ఎదురుచూస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ఎవ‌రు ఎప్పుడొస్తారో తెలీదుగానీ, ఈలోగా పార్టీకి ఇంకాస్త న‌ష్టం జ‌రిగిపోతోంది. ఇప్ప‌టికే శాస‌నమండ‌లిలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అసెంబ్లీలో కూడా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను కాంగ్రెస్ కి దూరం చేసే ఎత్తుగ‌డ‌ల్లో అధికార పార్టీ ఉంది.

ఈ నేప‌థ్యంలో పీసీసీ అధ్య‌క్షుడిగా ఉత్త‌మ్ మ‌రింత చురుగ్గా వ్య‌వ‌హ‌రించార‌నీ, పార్టీలో ఉన్న‌వారితో ట‌చ్ లో ఉండాల‌నీ, పార్టీ వీడ‌కుండా ఉండేలా నాయ‌కుల‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని కొంత‌మంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మ‌రి, ఉత్త‌మ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్న‌ట్టు… అంటే, దానికీ కార‌ణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ ఓట‌మికి ఆయ‌నే నైతిక బాధ్య‌త వ‌హించాల‌ని కొంద‌రు నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. పోనీ, గెలిచిన ఎమ్మెల్యేల‌ని పిలిచి మాట్లాడాల‌ని చూసినా… సొంత పార్టీ నుంచే వేరే విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని భావిస్తున్న‌ట్టున్నారు.

పోనీ, రాష్ట్రంలో ఇప్పుడున్న ప‌రిస్థితుల‌ను హైక‌మాండ్ కి తెలిపినా… అక్క‌డి నుంచి ఎలాంటి స్పందన వ‌స్తుంద‌ని ఆలోచిస్తున్నారేమో అనే అభిప్రాయ‌మూ వినిపిస్తోంది. అందుకేనేమో… ఇవ‌న్నీ ఎందుక‌ని కొన్నాళ్ల‌పాటు మౌనంగా ఉంటేనే ఉత్త‌మం అని ఉత్త‌మ్ అనుకుని ఉంటార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

leave a reply