ధోని ముంగిట..మరో రికార్డు!

ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ గెలిచిన కోహ్లి సేనకు ఈ చారిత్రాత్మక విజయంలో ధోని కీలకపాత్ర పోషించాడు. వరుస మూడు ఆర్దసెంచరీలతో అదరగొట్టిన ధోని ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ కూడా తన కైవసం చేసుకున్నాడు. ఆసీస్‌పై ధోని ఆడిన ఆటతీరుతో రిటైర్మెంట్‌ తీసుకోవాలని విమర్శలు చేసిన వారి నోళ్లు మూయించాడు. అయితే సిరీస్  గెలిచినప్పటి నుంచి మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో రెండు రోజుల్లో న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో ధోనీ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే..ధోని ముంగిట మరో అరుదైన రికార్డు చేరబోతోంది.

ఇప్పటివరకు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ ముందున్నాడు. తరువాతి స్థానంలో సెహ్వాగ్ ఉన్నాడు. సచిన్‌  652 పరుగులు 18 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌పై సాధించాడు. తర్వాతి స్థానంలో వీరూ 12 మ్యాచ్‌ల్లో 598 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 455 పరుగులతో ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్‌ను అధిగమించి ఈ జాబితాలో తొలి స్థానం దక్కించుకోడానికి ధోనీకి మరో 197 పరుగులు కావాల్సి ఉంది. ప్రస్తుతం అద్భుత అటతీరు కనబరుస్తున్న ధోనికి కివీస్ టూర్లో ఈ రికార్డును అందుకోవడం కష్టం కాదు.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఈనెల 23 నుంచి జరగనుంది. నేపియర్‌ వేదికగా తొలి వన్డే, మౌంట్‌ మౌంగనయ్‌లో రెండో మరియు మూడో వన్డేలు జరగనుండగా,  హామిల్టన్‌, వెల్లింగ్టన్‌లో చివరి రెండు వన్డేలు జరగనున్నాయి.అయితే గతేడాది పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన మచ్చను తొలగించుకోవాలంటే ఈ సిరీస్‌లోనూ ధోనీ దూకుడు కొనసాగించాల్సి ఉంది.

leave a reply