‘యమగోల’ స్టిల్ అదిరింది

తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ జీవిత చరిత్రను వెండితెరపై చూపించాలనే సంకల్పంతో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు నందమూరి బాలకృష్ణ. సంక్రాంతి కానుకగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ జనవరి 9వ తేదీన విడుదల చేస్తోంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్నారు. తాజాగా అప్పట్లో ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’ సినిమాలోని స్టిల్ బయటకు వదిలారు.

అప్పుడు ఎన్టీఆర్, జయప్రద జోడీ ఎలా ఉందో.. అచ్చు అలాగే ఉంది బాలకృష్ణ, హన్సిక జోడీ.. అంటున్నారు ఈ స్టిల్ చూసిన ప్రేక్షకులు. అంతేకాదు ఈ స్టిల్ కన్నుల పండుగగా, చూడముచ్చటగా ఉందని కితాబిస్తున్నారు. ఆనాడు ఎన్టీఆర్‌తో స్టెప్పులేసిన నటీనటులను మరోసారి వెండితెరపై ఈ రకంగా ఆవిష్కరిస్తున్నందుకు ఎంతో ఆనంద పడుతున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇలాంటి మరెన్నో సన్నివేశాలు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

బాలయ్య సొంత బ్యానర్ ఎన్‌బీకె ఫిలిమ్స్ బ్యానర్‌పై తానే లీడ్ రోల్ పోషిస్తూ దర్శకత్వ పగ్గాలను క్రిష్ చేతిలో పెట్టారు బాలయ్య. ఎన్టీఆర్ జీవితాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు భాగాలుగా చిత్రీకరించారు. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని మొదటిభాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో, రాజకీయ జీవితాన్ని ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో పొందుపరిచారు. కాగా, ఈ చిత్రంలో విద్యాబాలన్, రానా, సుమంత్, హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్, పాయల్ రాజ్‌పుత్ లాంటి భారీ తారాగణం పాల్గొంది.

leave a reply