నవ్వితే.. గుర్తుండిపోతుందట..!

నవ్వు నాలుగు విధాలకు చేటు అన్నారు పెద్దలు.. కాని నవ్వు నాలుగు విధాలుగా మంచిదని సైన్స్‌ చెబుతోంది. నవ్వడం వల్ల బాధ‌ను, విచారాన్ని పోగొట్టు కోవచ్చని, న‌వ్వు మ‌న‌కు ఉత్సాహాన్ని కూడా తెచ్చి పెడుతుందని అంటున్నారు. అలాగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా న‌వ్వు ఔష‌ధంగా ప‌నిచేస్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న దూర‌మ‌వుతాయి. ఇవే కాకుండా న‌వ్వ‌డం వ‌ల్ల జ్ఙాప‌క‌శ‌క్తి కూడా పెరుగుతుంద‌ట‌. ఇదే విష‌యాన్ని అధ్య‌యనాలు వెల్లడిస్తున్నాయి.

ఒత్తిడి వ‌ల్ల మ‌న‌లో విడుద‌ల‌య్యే కార్టిసాల్ అనే హార్మోన్ మ‌న మెద‌డు ప‌నితీరును దెబ్బ తీస్తుంది. మ‌న‌ల్ని మాన‌సికంగా కుంగిపోయేలా చేస్తుంది. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి కూడా త‌గ్గిపోతుంది. అయితే ఇది జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. రోజూ న‌వ్వాల‌ని సైంటిస్టులు చెబుతున్నారు. రోజూ ఆనందంగా ఉంటూ న‌వ్వ‌డం వ‌ల్ల మ‌తిమ‌రుపు రాకుండా ఉంటుంద‌ని, జ్ఞాప‌కశ‌క్తి కూడా పెరుగుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు ఒక అధ్య‌య‌నం చేప‌ట్టారు. కొంద‌రు వృద్ధులకు 20 నిమిషాల పాటు హాస్య‌భ‌రిత వీడియోల‌ను చూపించారు. ఆ స‌మ‌యంలో వారి జ్ఞాప‌క‌శ‌క్తిని ప‌రిశీలించారు. అలాగే వారిలో కార్టిసాల్ స్థాయిల‌ను కూడా ప‌రిశీలించారు. దీంతో తేలిందేమిటంటే… వారు న‌వ్వినంత సేపు ఒత్తిడి బాగా త‌గ్గింద‌ని, జ్ఞాప‌క‌శ‌క్తి పెరిగింద‌ని, కార్టిసాల్ స్థాయిలు బాగా తగ్గాయ‌ని తేల్చారు. అందువ‌ల్ల నిత్యం కొంత సేపు అయినా స‌రే అన్ని బాధ‌ల‌ను మ‌రిచిపోయి ఆనందంగా న‌వ్వాల‌ని సైంటిస్టులు వెల్ల‌డిస్తున్నారు.

కనుక సాధ‌ర‌ణ వ్య‌క్తులే కాక, వృద్ధులు కూడా నిత్యం న‌వ్వ‌డం వ‌ల్ల సొంతంగా తమ పనులను తాము చేసుకోవటానికి, హాయిగా జీవించటానికి వారికి జ్ఞాపకశక్తి చాలా కీలకం కాబట్టి వీరికి ఇతర చికిత్సలతో పాటు నవ్వు చికిత్సలనూ జోడించటం అవసరమని పరిశోధకులే తేల్చేశారు.

అలాగే నవ్వు వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నవ్వు యవ్వనంగా ఉండడానికి తోడ్పడుతుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. దీర్ఘాయువు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు నవ్వని వారికంటే 7 ఏళ్ళు ఎక్కువగా జీవిస్తారట. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. నవ్వడం వల్ల ఇమ్యునిటీ పవర్‌ పెరుగుతుంది. శరీరం ఒత్తిడి నుంచి ఉపశమనానికి గురవుతుంది.

leave a reply