పంచాయితీ ఎన్నికల నగరా.. నెలాఖరుకు అంతా సిద్ధం..!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయింది. ఈ నెల చివరికే .. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. మూడు విడతల్లో నిర్వహించనున్నారు. జనవరి 21న తొలి విడత, 25న రెండో విడత, జనవరి 30న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. నవంబర్‌ 11లోగా ఓటు నమోదు చేసుకున్నవారు అర్హులని… రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి ప్రకటించారు. కోటి 49 లక్షల 52వేల 58 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నారన్నారు. ఉ.7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్‌.. తర్వాత కౌంటింగ్ జరుగుతుందని ప్రకటించారు.

తెలంగాణలో . రాష్ట్రంలో మొత్తం 12,732 గ్రామ పంచాయతీలు.. 1,13,170 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,13,190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సర్పంచ్ ను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. వార్డు మెంబర్లు ఉపసర్పంచ్ ను ఎన్నుకుంటారు. తొలి విడతలో 4480 , రెండో విడతలో 4137, మూడో విడతలో 4115 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. బ్యాలెట్‌ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బ్యాలెట్‌లో నోటా గుర్తు కూడా ఉంటుంది. సర్పంచ్‌లుగా పోటీ చేసే జనరల్ అభ్యర్థులు రూ.2000, రిజర్వ్డ్‌ కేటగిరీ అయితే రూ.1000, జనరల్ కేటగిరీ వార్డు మెంబర్‌ రూ.500, రిజర్వ్డ్‌ అభ్యర్థి అయితే రూ.250 చొప్పున డిపాజిట్ చెల్లించాలని నాగిరెడ్డి ప్రకటించారు.

5వేల జనాభా దాటిన పంచాయతీలైతే అభ్యర్థులు రూ.2,50,000 మించి ఖర్చు చేయరాదు. 5వేలు కంటే తక్కువ జనాభా కల్గిన గ్రామ పంచాయతీలైతే 1,50,000 మించి ఖర్చు చేయకూడదు. తొలుత వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.అదే రోజు వార్డు మెంబర్లంతా కలిసి ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు. 19 గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఎన్నికలు జరగడం లేదు. 15 గ్రామ పంచాయతీల్లో ఇంకా సమయం ఉంది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల అధికారి ప్రకటించారు.

leave a reply