రాజకీయ లబ్ది పొందడానికే… బీజేపీ దాడులు..!

రాష్ట్రంలో సీబీఐ తీరుకు నిర‌స‌న‌గా ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ దీక్ష చేస్తుండగా.. ఆ దీక్షకు సంఘీభావం తెల‌ప‌డం కోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కోల్ క‌తా వెళ్లారు. మ‌మ‌తా చేస్తున్న దీక్ష‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఏదో ఒక విధంగా ల‌బ్ధి పొందాల‌నే దురుద్దేశంతోనే కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, రాజ్యాంగ సంస్థ‌ల దుర్వినియోగానికి పాల్ప‌డుతోంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోడీ ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర‌ల్ని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌మై స‌మ‌ర్థంగా తిప్పి కొడ‌తాయ‌ని, పాత కేసుల్ని తెర‌మీదికి తెస్తూ.. ఎన్నిక‌ల ముందే ఇలా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నారో ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

దేశంలోని అన్ని పార్టీల‌పైనా బీజేపీ బురద చ‌ల్లే కార్య‌క్ర‌మం పెట్టుకున్నార‌ని, ఆంధ్రాలో ప్ర‌త్యేక హోదా అడిగినందుకు సీబీఐతో ఎంపీల‌పై దాడులు చేయించార‌న్నారు. ఎమ్మెల్యేల‌పై ఈడీతో దాడులు జ‌రిపించార‌ని, ఇప్పుడు ప‌శ్చిమ బెంగాల్ పై కూడా అలానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే ఇలా అన్ని పార్టీలవారినీ ల‌క్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

కానీ, సుప్రీం కోర్టు ఇవాళ స‌రైన నిర్ణ‌యం వెలువ‌రించింద‌ని, అరెస్టు చెయ్యొద్దంటూ తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే అని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్రానికి రాష్ట్రాలు మ‌ర్యాద ఇస్తాయ‌ని, కేంద్రం కూడా రాష్ట్రాల ప‌ట్ల మ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. మ‌మ‌తా బెనర్జీ స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కురాల‌ని, ఇలాంటి పరిస్థితులను స‌మ‌ర్థంగా ఎదుర్కోగ‌ల‌రని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

ప‌శ్చిమ బెంగాల్ లో అన్ని స్థానాలు మ‌మ‌తా గెలుస్తార‌ని, జాతీయ రాజ‌కీయాల్లో నిర్ణ‌యాత్మ‌క శ‌క్తి అవుతార‌ని, అందుకే ఆమెను బ‌ల‌హీన ప‌ర‌చాల‌ని బీజేపీ చూస్తున్నార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ఇత‌ర పార్టీలు కూడా బ‌ల‌ప‌డే అవ‌కాశం లేకుండా చెయ్యాల‌నేదే వారి కుట్ర అన్నారు. ప‌శ్చిమ బెంగాల్ లో మ‌మ‌త‌కు అండ‌గా ప్ర‌జ‌లున్నార‌ని… అన్ని లోక్ స‌భ స్థానాల‌ను మ‌మ‌తా గెలుస్తున్నార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు.

మొత్తానికి, పశ్చిమ బెంగాల్ లో విషయంలో కేంద్రం తాజా వైఖరి… ప్రతిపక్షాల ఐక్యతకు మరో వేదికగా మారుతున్నట్టుగా కనిపిస్తోంది. మమతాకు చంద్రబాబుతో పాటు, భాజపాయేతర పక్షాల నుంచి మద్దతు పెరిగే అవకాశం ఉంది.

leave a reply