సింహాచలం అప్పన్నస్వామి

దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము. సింహాచలము అనే గ్రామంలో విశాఖకు 11 కి.మీ. దూరంలో సింహగిరి పర్వతంపైన ఉంటుందీ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్నగా కొలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది.

స్వయంభూగా వెలసిన ఈ స్వామి సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు (మే నెలలో) వస్తుంది.

స్థలపురాణం ప్రకారం.. 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం బట్టి చెప్పబడుతుంది. ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహనరసింహ స్వామి విగ్రహన్ని ఆరాదించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్ళుతుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహనరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగే టట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహనరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. లింగాకృతిలో నిత్యరూపం ఉంటుంది. అందుకే మనకు ఈ స్వామి సంవత్సరంలోని 12 గంటలు మాత్రమే నిజరూప దర్శనం ఇస్తూ ఉంటాడు. ఈ సమయంలోనే ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలనుంచి భక్తులు ఎక్కువగా వస్తూంటారు. ఏటా ఈ ఆలయం రూ.52 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది.

ఇక ఈ ఆలయం మొక్క ప్రత్యేకతలు ఏమనగా.. చందనోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి, బ్రహ్మోత్సవాలు వంటి వాటిని ఆలయ కమిటీ వారు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అలాగే ప్రత్యేక పూజా విధానాలు ఉంటాయి. భక్తులు స్వామివారికి చందనాన్ని ఇవ్వడం ఆనవాయితీగా భావిస్తారు.

leave a reply