మట్టిలో మాణిక్యంలా తన గొంతుతో ఎంతో తియ్యగా పాటలు పాడుతూ ఈ మధ్య అందరినీ పలకరిస్తున్న పసల బేబీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు. సీఎంతో పాటు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి శనివారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో బేబీని చంద్రబాబుకు పరిచయం చేశారు. ఎలాంటి సంగీత కోచింగ్ లేకుండా సినీ, అన్ని రకాల పాటలను ఒక్కసారి వింటే చాలు.. సీనియర్ సింగర్స్ లా పాడగల నేర్పు ఉన్న పసల బేబీదని సీఎం అభినందించారు.
వ్యవసాయ కూలీగా ప్రారంభమైన ఆమె ప్రస్థానం సినీ పాటలతో లక్షల మంది ఆన్‌లైన్ ప్రేక్షకులను మెప్పించడం గర్వకారణమని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఆమె ప్రతిభను మెచ్చుకొని సన్మానించారు. ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశించారు. అనపర్తి నియోజకవర్గంలోని వడిసలేరు గ్రామీణ నేపథ్య గాయకురాలు పసల బేబి కొద్దికాలంగా పాటలను అనర్గళంగా, అమోఘంగా పాడుతూ ప్రేక్షకులను మాత్రమే కాకుండా సంగీత దర్శకులు కీరవాణి, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.