`అమ్మ పెట్టనూ పెట్టదు అడుక్కు తిననివ్వదు’..!

గురువారం కడప జిల్లాలో పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. కడప జిల్లా మైలవరం కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు పాల్గొన్నారు.

సభలో సీఎం మాట్లాడుతూ.. కడపలో ఉక్కు పరిశ్రమతో రాయలసీమ చరిత్ర  పూర్తిగా మారుతుందని అన్నారు. ఈ నిర్మాణాన్ని వీలైనంత త్వరలోనే పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు. `అమ్మ పెట్టనూ పెట్టదు అడుక్కు తిననివ్వదు’ అన్న చంద్రంగా కేంద్రం తీరు తయారైందని విమర్శించారు. మన శక్తి ఏంటో కేంద్రానికి తెలియజెప్పేలా ఉక్కు పరిశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నీరు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదని ఆయన విమర్శించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. దిల్లీ వెళ్లి పోరాటం చేసినా కేంద్రం కనికరించలేదన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణ దీక్ష చేశారని గుర్తు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా కేంద్రం పట్టించుకోకపోవడంతో 60 రోజుల అల్టిమేటం ఇచ్చామని, ఆ..లోపు ముందుకు రావాలని కేంద్రాన్ని కోరామన్నారు. అప్పటికీ స్పందించపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే పరిశ్రమ ఏర్పాటు బాధ్యతను తీసుకుందన్నారు.

రాష్ట్రానికి న్యాయం చేయాలని కేంద్రంపై పోరాడుతుంటే టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం మనల్ని బానిసలుగా.. పన్నులు కట్టే యంత్రాలుగా మాత్రమే చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నాయకులు ఉక్కు పరిశ్రమపై పోరాడకుండా పారిపోయే పరిస్థితికి వచ్చారని పరోక్షంగా వైకాపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పరిశ్రమ ఏర్పాటుకు వైకాపా అధినేత జగన్‌ ఏనాడైనా ప్రయత్నం చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు.  జగన్‌ వంటి నేతలకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఇష్టం లేదన్నారు. ఉక్కు పరిశ్రమతో ఇక్కడి భూములకు విలువ పెరిగి రైతులు ఆనందంగా ఉండటం జగన్‌కు ఇష్టం లేదా అని సీఎం ప్రశ్నించారు.

leave a reply