ఆ ఒక్క నిర్ణయంతో…సంచలనాలు!

కొన్నేళ్ల క్రితం టీమిండియాకు  ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ పిచ్‌లపై  సిరీస్‌ గెలవడం చాలా కష్టంగా ఉండేది.ఒక్కోసారి సిరీస్‌లో ఒకటి రెండు మ్యాచ్‌లు గెలిచినా గొప్పగా ఉండేది. ఉపఖండంపై ఉండే మందకొడి పిచ్‌లపై మాత్రమే భారత్‌ రాణించగలదనే భావన ఉండేది. ఇది పొగడ్తో.. విమర్శో అర్థం అయ్యేది కాదు… కానీ గత కొన్నేళ్లుగా విదేశీ గడ్డపై కూడా భారత్  నిలదొక్కుకుంటుంది. ఒకప్పుడు హోం టైగర్స్‌గా పేరున్న భారత జట్టు ఇప్పుడు దుర్భేద్యంగా తయారైంది.టీమిండియా అంటే స్పిన్నర్లు మాత్రమే ఉంటారనే భావన ఉండేది.. కానీ ఇప్పుడు ప్రపంచ స్థాయి నాణ్యమైన పేస్‌ బౌలర్లు పుట్టుకొవచ్చారు. దేశీయ పిచ్‌లపై మరింత  పచ్చిక పెంచాలని బీసీసీఐ తీసుకొన్న ఒక కీలక నిర్ణయం వల్ల ఈ మార్పు వచ్చింది.

అంతర్జాతీయ వేదికలపై భారత్‌ ప్రదర్శన నిలకడగా ఉండేది కాదు. విదేశాల్లోని పచ్చటి మైదానాలపై దూసుకొచ్చే బంతులను  ఎలా ఎదుర్కోవాలో అర్థంకాక భారత బ్యాట్స్‌మన్‌ తడబడే వారు. ఈ విషయం బాగా తెలిసిన బీసీసీఐ భారత క్రికెట్‌ జట్టును దుర్భేద్యంగా మార్చాలంటే ఉన్న లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించింది. దీంతో ఆటగాళ్లకు బౌలింగ్‌ పిచ్‌లను అలవాటు చేయాలని నిర్ణయించింది. బీసీసీఐ తన పరిధిలో ఉండే మైదానాల్లోని పిచ్‌లపై గల పరిస్థితులను బట్టి పిచ్‌లపై కనీసం 5 మిల్లీ మీటర్ల నుంచి 8 మిల్లీ మీటర్ల వరకు పచ్చికను కచ్చితంగా ఉండాలని నిర్ణయించింది. దీంతో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో కనిపించేటటువంటి పచ్చికతో కూడిన మైదానాలు భారత్‌లో కూడా దర్శనమివ్వడం మొదలైంది. ఐదురోజుల మ్యాచ్‌ల ఫలితాలు తేలేలా మైదానాలు  అందుబాటులోకి వచ్చాయి.

ఈ మార్పు ఫలితంగా దేశవాళీ టోర్నీల్లో మెల్లగా సీమర్ల ఆధిపత్యం మొదలైంది. కొన్నేళ్లుగా స్పిన్నర్లతో పోలిస్తే సీమర్లే మెరుగైన సగటులు నమోదు చేస్తున్నారు. దీనికి తోడు బ్యాట్స్‌మెన్లు కూడా వేగంగా దూసుకొచ్చే బంతులను ఎదుర్కోవడానికి వెనకాడట్లేదు. దాదాపు 37 దేశవాళీ జట్లు ఉన్న భారత్‌కు ఈ పిచ్‌లు బాగా ఉపయోగపడ్డాయి. ఫలితంగా బుమ్రా, షమీ, భువి, పాండ్యా వంటి స్టార్లు తెరపైకి వచ్చారు. అంతేకాదు విదేశీగడ్డపై భారత బ్యాట్స్‌మెన్లు పరుగుల వరదను పారిస్తున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు భారత్‌ ఆడిన మ్యాచ్లలో అద్భుతంగా రాణించింది. ఇక టెస్ట్ సిరీస్లలో టీం ఇండియా తిరుగులేని ప్రదర్శనను కనబరుస్తుంది. ఇక న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్‌లో  ఆతిథ్య జట్టుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా, ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 3-0తో కైవసం చేసుకుంది.

leave a reply