కమలం, పసుపు మధ్య వార్.. ఏమవుతుందో…!

సార్వ‌త్రిక ఎన్నిక‌లు దగ్గర పడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. గత ఎన్నికలలో కలిసి పోటీ చేసిన తెలగుదేశం, బీజేపీ ఒక దానిపై మరొకటి తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఏపిలో అధికార పార్టీ తెలగుదేశం కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బిజెపి నేత‌లు సైతం రాష్ట్ర స్థాయిలో టిడిపిని.. ప్ర‌ధానంగా ఆ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అయితే, ప్రస్తుతం ప్ర‌ధాని మోదీ ఏపి ప‌ర్య‌ట‌న ఖ‌రారు కావ‌టంతో.. టిడిపి వ్యూహాత్మ‌కంగా త‌మ విజ‌యాల‌ను.. కేంద్ర స‌హాయ నిరాక‌ర‌ణ‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇదే స‌మ‌యంలో.. బిజెపి జాతీయ నాయ‌క‌త్వం సైతం టిడిపి బండారం బ‌య‌ట పెడ‌తామ‌ని హెచ్చ‌రిస్తుండటంతో ఒక్కసారిగా ఆంధ్రా రాజకీయాలు వేడెక్కాయి.

రాష్ట్ర విభ‌జ‌న అనంతరం ఏపిలో ప‌గ్గాలు చేప‌ట్టిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ‌రుస‌గా శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేశారు. మ‌రోసారి ఈ నాలుగున్నారేళ్ల పాల‌న పై రంగాల వారీగా శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేయాల‌ని చంద్రబాబు నిర్ణ‌యించారు. నరేంద్ర మోదీ జనవరి 6వ తేదీన రాష్ట్రానికి వస్తుండటంతో డిసెంబర్ నెల చివరి వారం, లేదా జనవరి మొదటి వారంలో చంద్రబాబు శ్వేత పత్రాల విడుదల చేయ‌టం ఆరంభిస్తార‌ని స‌మాచారం.

ప్ర‌ధాని త‌న స‌భ‌లో రాష్ట్రానికి ఇచ్చిన సంస్థలు, నిధులపై ఆయన ప్రజలకు వివరించడంతో పాటు, బీజేపీ ఎపీ అభివృద్దికి కట్టుబడి ఉందని చెప్పబోతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌.. ఏపికి ఇచ్చిన హామీల్లో ఎంత వ‌ర‌కు అమ‌లు చేసాము.. ఏమేర ఆర్దిక సాయం అందించాము.. హోదా పై ఎవ‌రు ఏం చెప్పారు.. ఎన్డీఏ నుండి టిడిపి ఎందుకు విడిపోయింద‌నే అంశాల‌ను వివ‌రిస్తార‌ని బిజెపి నేత‌లు చెబుతున్నారు.

 ప్ర‌ధాని స‌భ ద్వారా .. ఆ త‌రువాత జాతీయ నేత‌ల స‌భ‌ల‌ను సైతం ఏర్పాటు చేసి టిడిపి బండారాన్ని బ‌య‌ట పెడ‌తామ‌ని బిజెపి నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు.

ఇక‌, ప్ర‌ధాని స‌భ ల‌క్ష్యాన్ని అంచ‌నా వేసిన తెలుగుదేశం కొత్త వ్యూహంతో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తుంది. కేంద్రంతో పాటుగా ఏపిలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పి కొట్టేందుకు శ్వేత ప‌త్రాల ద్వారా వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉం చాల‌ని ముఖ్య‌మంత్రి నిర్ణ‌యించారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, పారిశ్రామిక పురోగతి, వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య పరిశ్రమలో సాధించిన అభివృద్ది, రాజధాని, పోలవరం నిర్మాణం, రాయలసీమకు సాగు, తాగు నీరు, రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు.. వంటి అంశాలపై వ‌రుస‌గా శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. అదే విధంగా ఏపి విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపికి రావాల్సింది..ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్కింది.. హోదా అంశం తో పాటుగా కేంద్ర తీరును ఈ శ్వేత ప‌త్రాల ద్వారా బ‌య‌ట పెట్ట‌టానికి నిర్ణ‌యించింది.

కాగా, రానున్న రోజుల్లో ఎవ‌రి బండారం ఎవ‌రు బ‌య‌ట పెడ‌తారో.. ప్ర‌జ‌ల్లో ఎటువంటి స్పంద‌న వ‌స్తుందనేది సమయం ద్వారా వేచిచూడాల్సి ఉంది.

leave a reply