కేసీఆర్‌ `మహా యాగం’

తెలంగాణలో సీఎం కేసీఆర్‌ మరో మహా యాగానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణా సీఎం హోదాలో కేసీఆర్‌ మళ్లీ మరో యాగం చేయనున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన యాగం తలపెట్టిన విషయం తెలిసిందే. పోయినసారి 5వేల మంది పండితులతో యాగం నిర్వహించారు.

కాగా.. మరో మారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాగంకు సిద్ధమయ్యారు. మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని కేసీఆర్ నిర్వహించనున్నారు. జనవరి 21 నుంచి 25 వరకు ఐదు రోజుల పాటు యాగం సాగనుంది.  ఎర్రవల్లిలోని ఫాం హౌస్‌లో యాగం నిర్వహించనున్నట్లు సమాచారం. ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో ఈ యాగం జరగనుంది. తొలి రోజు 100 సప్తశతి చండీ పారాయణాలు చేస్తారు. రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 పారాయణాలు చేస్తారు. అన్నీ కలిపితే వెయ్యి పారాయణాలు అవుతాయి.

ఐదవ రోజున 11 యజ్ఞ కుండలాల వద్ద… ఒక్కో కుండలం వద్ద 11 మంది రుత్విక్కులతో 100 పారాయణాలతో హోమం నిర్వహిస్తారు. అనంతరం పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమవుతుంది. ప్రతి రోజు సాయంత్రం భాగవత, రామాయణ పారాయణం చేస్తారు. అలాగే.. ఈ మహా యాగానికి రాష్ట్రపతి, గవర్నర్‌తో పలువురు ప్రముఖులను కూడా ఆహ్వానించనున్నారు.

leave a reply