కోస్తాకు తుఫాను… హెచ్చరిక!

 లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు పునరావాస ప్రాంతాలకు చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

కోస్తా జిల్లాలకు తుఫాను హెచ్చరిక,ఈ తుఫానుకు అధికారులు పెను తుఫాన్‌ ‘పెథాయ్‌’ గా గుర్తించారు. కోస్తాకు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం బలపడి గురువారం వాయుగుండంగా మారింది. రాగాల 24 గంటలలో దీని ప్రభావం ఎక్కువ అవ్వచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ తుఫాను గంటకు 10కి.మీ. వేగంతో ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ సాయంత్రానికి మచిలీపట్నానికి 1,200 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది తీరం దిశగా వచ్చేక్రమంలో తీవ్ర తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని సహాయ చర్యలను ముమ్మరం చేయమని మంత్రి నారా లోకేశ్‌ జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పునరావాస కేంద్రాలు, గ్రామీణ నీటి సరఫరాలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మరియు ఆహార నిల్వలను సరిపోయాలా చేసుకోవాలని సూచించారు. తుఫాన్‌ ముంచుకొస్తున్నందున అధికారులను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవలసిందిగా అధికారులను హెచ్చరించారు. ఇంధన శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించాలని మంత్రి కిమిడి కళావెంకటరావు సూచించారు. కాగా, తుఫాన్‌ సమయంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన నిల్వలను సిద్ధంచేసి, వాటిని సురక్షిత ప్రాంతాలలో ఉండేలా చూసుకోవాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కాగా…. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ కోస్తా జిల్లాలపై మరింత ప్రభావం చూపుతుందని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది.

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో చేపల వేటకు మత్యకారులను వెళ్లకుండా చూడాలని, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు రావాలని సూచించింది. శుక్రవారం నుంచి కోస్తాలో తీరంవెంబడి గంటకు 45నుంచి 50కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. తుఫాన్‌ మధ్య కోస్తాలో 16రాత్రి లేదా 17న ఉదయం తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తాలో అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. తుఫాన్‌ నేపథ్యంలో ఈనెల 15నుంచి కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయి. 16 నుంచి రెండు రోజుల పాటు కోస్తాలో విస్తారంగా, పలుచోట్ల భారీగా వర్షపాతం నమోదవుతుందని సూచించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు పునరావాస ప్రాంతాలకు చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

leave a reply