తెంపుడు గాళ్లు.. బెంబేలెత్తుతున్న మహిళలు

ఒంటరి మహిళలే టార్గెట్‌గా  తెంపుడుగాళ్లు తెగబడుతున్నారు. బంగారు పుస్తెల  తాడుల కోసం పీకలతో చెలగాటమాడుతున్నారు. రెండు రోజుల వ్యవదిలో రాచకొండ కమిషనర్ రేట్ పరిధిలో పది చోట్ల స్నాచింగులకు పాల్పడుతున్నారంటే చైన్ స్నాచింగ్ నేరగాళ్లు ఎంతలా మహిళలను  భయాందోళనకు గురిచేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

 హైదరాబాద్ శివారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వనస్థలిపురం, ఎల్బీనగర్, మీర్ పేట్, హయత్ నగర్ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల గ్యాంగులు దోపిడీలకు పాల్పడ్డాయి. దేవాలయానికి వెళ్లొచ్చే భక్తులు, కూరగాయల కోసం వెళ్లిన మహిళలు, ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న మహిళల్ని టార్గెట్ చేశారు దొంగలు. వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని వైదేహినగర్ లో లక్ష్మి అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా.. నాలుగున్నర తులాల బంగారుగొలుసును తెంచుకెళ్లారు.

వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలోని హైకోర్టు కాలనీ వద్ద జాతీయరహదారి పక్కన చలి దుస్తులు కొంటున్న రేష్మారెడ్డి అనే మహిళ మెడలోని నాలుగు తులాల బంగారు చైన్ లాక్కుని పారిపోయారు. ఇక హస్తినాపురం ఈస్ట్ లో విజయమ్మ అనే మహిళ కూరగాయలకు వెళ్లొస్తుండగా.. దారిలో బైక్ పై వచ్చిన స్నాచర్లు ఆమె మెడలోని ఐదున్నర తులాల బంగారు చైన్ ను లాక్కుని ఉడాయించారు. ఎల్బీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అనుపమనగర్, మీర్ పేట్ పోలీసుస్టేషన్ పరిధిలోని బీడీ రెడ్డి గార్డెన్ సమీపంలో ఆమె మెడలోని నాలుగున్నర తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కుని పరారయ్యారు స్నాచర్లు.

వనస్ధలిపురంలో 2 కేసులు, ఎల్బీనగర్ లో 2 కేసులు, మీర్ పేట్ లో ఓ కేసు, హయత్ నగర్ లోరేండు చైన్ స్నాచింగుల కేసులు నమోదయ్యాయ్. పవిత్రమైన మాంగల్యాన్ని దొంగలు అపహరించుకెళ్లడంతో లబోదిబోమంటున్నారు బాధితులు.

వరుస చైన్ స్నాచింగులు కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ లను పోలీసులు సేకరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన రెండు గ్యాంగులే ఈ చైన్ స్నాచింగులకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. నాలుగు చైన్ స్నాచింగులు ఒకే గ్యాంగ్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు పోలీసులు. చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు యాంటీ చైన్ స్నాచింగు బృందాలు రంగంలోకి దింపారు. బస్టాపులు, రైల్వేస్టేషన్లతో పాటు.. రోడ్లపై తనిఖీలను ముమ్మరం చేశారు పోలీసులు.

కానీ, పోలీసుల నిఘా లేకపోవడంతో చైన్ స్నాచింగులు పెరిగిపోయాయని వాపోయారు బాధితులు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. త్వరగా దొంగల్ని పట్టుకుని తమ సొమ్ములు తమకు ఇప్పించాలని వేడుకుంటున్నారు బాధితులు.

leave a reply