సెమీఫైనల్లో సైనా…సింధు ఓటమి!

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ శుక్రవారం జరిగిన మ్యాచ్ గెలుపుతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ సీజన్లో ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో వరుసగా మూడో విజయంతో సైనా తన జోరు కొనసాగించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సైనా 21–7, 21–18తో పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)పై చక్కటి ప్రదర్శనతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ హి బింగ్‌జియావో (చైనా)తో సైనా తలపడుతుంది. పోర్న్‌పవీతో జరిగిన మ్యాచ్‌లో సైనా తొలుత 3–0తో ఆధిక్యాన్ని 8–2కి పెంచుకుంది. పోర్న్‌పవీ నుంచి సైనా ఖాతాలో తొలి గేమ్‌ చేరిపోయింది. రెండో గేమ్‌లోనూ తొలుత 3–0 ఆధిక్యంతో ఉన్న సైనా ఒక దశలో వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోవడంతో ఆధిక్యం చేజారినట్లు కనిపించిన, ఆ తరువాత తేరుకొని కీలకదశలో సైనా పైచేయి సాధించడంతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

అటు ఈ సీజన్లో టైటిల్ నెగ్గాలని క్వార్టర్‌ ఫైనల్లో అడుగు పెట్టిన మరో స్టార్ పీవీ సింధు 11–21, 12–21తో ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడిపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. వీరి మధ్య జరిగిన ఈ పోరులో సింధు ఏ దశలోనూ మారిన్‌కు పోటీగా నిలువలేకపోనుంది. పైగా రెండు గేముల్లోనూ ఒక్కసారి కూడా స్కోరు సమం చేయలేకపోయింది. మరో వైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో కిడాంబి శ్రీకాంత్‌ పోరాటం కూడా క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 18–21, 19–21తో ఓటమి పాలయ్యాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ అనవసర సమయాల్లో పొరబడి, గేమ్‌ను చేజార్చుకొని మూల్యం చెల్లించుకున్నాడు.

leave a reply